ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది కాంతార మూవీ. ఓ వైపు డైరెక్షన్ చేస్తూనే హీరోగా అద్భుతంగా నటించారు రిషబ్ శెట్టి. ఈ సినిమాను కర్ణాటక, తమిళనాడులోని ఆచారాలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు రిషబ్ శెట్టి. ఈ మూవీ ద్వారా అక్కడి భూతకోల సంస్కృతిని యావత్తు దేశానికి తెలియజేశారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాలలో దేవుడు ఆవహించిన సమయంలో కోల ఆడే వ్యక్తులు ఓ.. అంటూ ఓ వింత శబ్దాన్ని చేస్తారు. దాన్ని రిషబ్ ఈ మూవీలోనూ చూపించారు.
సినిమాలో ఆ సౌండ్ వినిపించిన ప్రతీసారి ప్రేక్షకులు థియేటర్లు దద్దరిల్లేలా అరుస్తున్నారు. మూవీ నుంచి వచ్చిన తర్వాత కూడా ఓ అంటూ కేకలు వేస్తూ గోల గోల చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై రిషబ్ శెట్టి రియాక్ట్ అయ్యి అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశారు.
ఓ.. అనేది కేవలం ఓ సౌండ్ మాత్రమే కాదని అది తమకు ఓ సెంటిమెంట్ అని తెలిపారు రిషబ్. కాంతార సినిమాను చూసిన ప్రేక్షకులకు నాదో చిన్న విన్నపం. సినిమాలో మేము ఉపయోగించిన ఆ శబ్దాలను మీరు బయట అనుకరించొద్దు. అది ఓ ఆచారం, ఆధ్యాత్మిక నమ్మకం. అలాగే అది చాలా సెన్సిటివ్ విషయం. మీరు ఇలా చేయడం వల్ల ఆచారం దెబ్బతినొచ్చు. అందువల్ల దయచేసి ఎవరూ దాన్ని ఫాలో అవ్వకండి అని ప్రేక్షకులకు రిషబ్ రిక్వెస్ట్ చేశారు.