అభివృద్ధి నిరోధకుడైన రాజగోపాల్ రెడ్డికి ఉపఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు చేయాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడులో నిలిచిపోయిన అభివృద్ధి టీఆర్‌ఎస్ గెలుపుతోనే ముందుకు సాగుతుందన్నారు. బీజేపీకి పుట్టగతులు లేకుండా చేయాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండలంలో మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడికిపోయినా ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయాడని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తున్నారని వెల్లడించారు.
2014లో టీఆర్‌ఎస్ గెల్చిన తర్వాతే మునుగోడులో అభివృద్ధి జరిగిందన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యే ఉన్నానని చెప్పారు. తన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యకు పరిష్కారం చూపానని తెలిపారు. మరోసారి తనను గెలిపిస్తే మునుగోడు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తానన్నారు.
అభివృద్ధి చేసుకునే అద్భుత అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడు పోయారని చెప్పారు. వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకోకుండా టీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు.రాజగోపాల్ రెడ్డి అనే దొంగ వేల కోట్ల కాంట్రాక్టులు పొంది బీజేపీలోకి పోయాడని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కోమటిరెడ్డి మోసకారి అని, అబద్ధాల కోరని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ప్రభంజనం కనిపిస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను దెబ్బతీయాలని మోదీ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.