బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఇటీవల తప్పుకున్న సంగతి విదితమే. పదవి కాలం పూర్తవ్వడంతో దాదా స్థానంలో రోజర్ బిన్నీ ఆ పదవికి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీకి మద్ధతుగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందిస్తూ గంగూలీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఐసీసీ చైర్మెన్‌గా సౌరవ్ గంగూలీ పోటీ పడేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీని అభ్యర్థించనున్నట్లు దీదీ తెలిపారు. బీసీసీఐ నుంచి గంగూలీని అక్రమ రీతిలో తప్పిస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు. తనకు బాధగా ఉందని, సౌరవ్ పాపులర్ వ్యక్తి అని, ఇండియా జట్టుకు కెప్టెన్‌గా చేశారని, ఆయన దేశం కోసం ఎంతో చేశారని, బెంగాల్‌కే కాదు, యావత్ దేశానికి అతను గర్వకారణమని, ఎందుకు బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి గంగూలీని తప్పించారని ఆమె అడిగారు.
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో రిపోర్టర్లతో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానని, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎన్నికల్లో గంగూలీ పోటీ పడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని దీదీ కోరారు. ఐసీసీ చైర్మన్ పదవి కోసం అక్టోబర్ 20వ తేదీన నామినేషన్లు వేయనున్నారు.