ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌పై సుల్తాన్‌పుర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బీఎమ్‌డబ్ల్యూ కారు కంటైనర్ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు ఇంజన్ పేలి కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన గత శుక్రవారం జరగగా ఈ ప్రమాదానికి కారణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
సుల్తాన్‌పుర్ సమీపంలో హైవేపై నలుగురు స్నేహితులు బీఎమ్‌డబ్ల్యూ కారులో వెళ్తున్నారు. ఈ సమయంలో కారు స్పీడు 230 కిలోమీటర్లు. ఇంతలో పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. కారు స్పీడుగా వెళ్తుంది అని మనం లైవ్‌లో ఉన్నాం.. 300 వరకు స్పీడ్ పెంచు అని చెప్పాడు. దీనికి కారులో ఉన్న తోటి ఫ్రెండ్ స్పందిసతూ అంత వేగం వద్దురా.. నలుగురం చచ్చిపోతాం.. అన్నాడు. ఇంతలో డ్రైవర్ మీరంతా సైలెంట్‌గా ఉండడిరా అప్పుడే డ్రైవింగ్ సరిగా చేయగలను అన్నాడు. అయితే డ్రైవర్ 230 దగ్గర కారు వేగం తగ్గించడంతో వీడియో తీస్తున్న వ్యక్తి ఎందుకు రా స్పీడు తగ్గిస్తున్నావ్. వేగం తగ్గించుకోకు.. పిక్‌అప్ చేసుకోలేం అని అన్నాడు. ఈ మాటలన్నీ లైవ్ వీడియోలో రికార్డు అయ్యాయి.
యాక్సిడెంట్ టైమ్‌లో వారి స్పీడ్ ఎంతలా ఉంది అంటే కంటైనర్‌ను ఢీకొట్టిన తర్వాత కారు ఇంజిన్ పేలి అందులోని నలుగురు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారు. వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు డాక్టరు, మరొకరు ఇంజినీరు, ఇద్దరు వ్యాపారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.