చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ దశరథం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించిన నగ్న వీడియోలు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయని వాటిని తొలగించేందుకు డబ్బు కావాలని డిమాండ్ చేశారు
సైబర్ నేరగాళ్లు. ఈమేరకు డీఎస్పీ నుంచి రూ.97,500 వసూలు చేశారు. డీఎస్పీ ప్రవర్తనను గమనించిన తోటి పోలీసు అధికారి విషయం తెలుసుకుని అది సైబర్ క్రైమ్ అని చెప్పడంతో డీఎస్పీ కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు.
డీఎస్పీ సీహెచ్ దశరథంతో అమ్మాయిల పేరుతో ఇటీవల సైబర్ నేరగాళ్లు ఛాటింగ్ చేశారు. అది కాస్త నగ్న వీడియో కాల్స్ మాట్లాడేవరకు దారితీసింది. ఆయన నగ్న వీడియోలను వారు రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. డీఎస్పీ వారి బెదిరింపులకు లొంగకపోవడంతో సీబీఐ అధికారి అజయ్‌కుమార్ పాండే పేరుతో ఫోన్ చేశారు. మీ నగ్న వీడియోపై యూట్యూబ్‌లో కంప్లైంట్ వచ్చిందని.. సదరు వ్యక్తికి డబ్బు చెల్లిస్తే మీపై ఏ యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఈ మేరకు సీబీఐ పేరుతో ఓ లేఖ కూడా పంపించారు. నిజమని నమ్మిన డీఎస్పీ రెండు విడతల్లో రూ.97,500 వారు సూచించిన అకౌంట్‌లో జమ చేశారు.
అనంతరం తన దగ్గర మరో రెండు వీడియోలు ఉన్నాయని వాటిని వైరల్ చేయకుండా ఉండేందుకు మరో రూ.85 వేలు పంపాలని డిమాండ్ చేశారు. దీంతో విధుల్లో ఉన్న డీఎస్పీ కంగారుగా ఉండటాన్ని గుర్తించిన తోటి అధికారి విషయం అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదంతా సైబర్ క్రైమ్ అని చెప్పాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన అధికారులు.. సైబర్ నేరగాళ్లు పశ్చిమ బెంగాల్ నుంచి మోసం చేశారని గుర్తించారు.