హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కు కూడా నిన్న శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. అయితే సీఈసీ మాత్రం హిమాచల్ ప్రదేశ్ కు ప్రకటించి గుజరాత్ కు మాత్రం ప్రకటించలేదు. అయితే గుజరాత్‌కు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వస్తుంది. దీని వల్ల గుజరాత్‌కు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉండదు. అలాగే ఎన్నికలకు ముందు మరికొన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు బీజేపీ ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ఒకేసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఆ అవకాశం ఉండదు. ప్రచారానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ రెండు రాష్ర్టాల ఎన్నికలకు మధ్య వ్యవధి ఉండటం వల్ల హిమాచల్‌లో ప్రచారానికి వెళ్లిన నాయకులు తిరిగి గుజరాత్ ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లడానికి వెసులుబాటు కలుగుతుంది. మరోవైపు గుజరాత్ కంటే హిమాచల్‌లో బీజేపీ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నట్టు బీజేపీ అంచనా వేస్తున్నది. హిమాచల్‌లో నవంబర్ 12న పోలింగ్ తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్ గుజరాత్ ఓటర్లను ప్రభావితం చేసేలా ఉండాలన్నది కూడా బీజేపీ వ్యూహంగా ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గత ఆరు నెలల్లో గుజరాత్‌కు రూ.80 వేల కోట్ల వరాలను కురిపించిన ప్రధాని మోదీ.. ఇటీవల రెండు రోజులపాటు ఆ రాష్ట్రంలో పర్యటించి రూ. 27,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అయితే, బీజేపీ షెడ్యూల్ ప్రకారం.. గుజరాత్‌లో మరో రూ. 10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు, ఇతరత్రా హామీలు ప్రకటించాల్సి ఉన్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే, ఆ హామీల ప్రకటన కుదరకపోవచ్చని, అందుకే ఈసీ ద్వారా షెడ్యూల్ విడుదలను అధికార బీజేపీ వాయిదా వేయించిందని అనుమానం వ్యక్తం అవుతున్నాయి.
హిమాచల్‌కు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించి, గుజరాత్‌కు ప్రకటించకపోవడం ఎన్నో ప్రశ్నలు, అనుమానాలకు తావిస్తున్నది. ఈ రెండు రాష్ర్టాల అసెంబ్లీల గడువు దాదాపుగా ఒకేసారి ముగుస్తున్నది. అలాంటప్పుడు ఏ ఉద్దేశంతో గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించకుండా ఈసీ వాయిదా వేసింది?