తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ క్రమంలో రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చాయి.
కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో పాల్వాయి స్రవంతిని నిలిపినప్పటికీ ఆ పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పరోక్షంగా మద్దతిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలో పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నటువంటి ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండటంపై పెద్ద చర్చే జరుగుతున్నది.
ఇప్పటివరకు ఆయన మునుగోడులో అడుగుపెట్టింది లేదు.. పార్టీ తరఫున ప్రచారం చేసిందీలేదు. పైగా ఈ నెల 15న ఆయన కుటుంబ సమేతంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నట్టు సమాచారం. స్థానబలం ఉండి.. పార్టీలో కీలక నేత అయిన వెంకట్‌రెడ్డి ప్రచారం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం. అయినా ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. విచిత్రమేమంటే పార్టీ పెద్దలు కూడా వెంకట్‌రెడ్డి విషయంలో అంటీముట్టనట్టు ఉంటున్నారు. ఆయన వ్యవహారశైలిపై పార్టీ అధిష్ఠానం ఒక్క మాట కూడా మాట్లాడటంలేదు. ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.