తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉపఎన్నికల వేళ అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ కు ఝలక్ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ గులాబి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బూర నర్సయ్యగౌడ్ లేఖ రాశారు..
కాగా బూర నర్సయ్య మునుగోడు టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. ఉపఎన్నిక సందర్భంగా ఒక్కసారి కూడా తమతో సంప్రదించలేదని వాపోయారు. మునుగోడు నియోజకవర్గంలో ఆత్మగౌరవ సభ సందర్భంగా సమాచారం ఇవ్వకున్నా అవమానాన్ని దిగమింగి ఉన్నానన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలకు ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్య రంగాల్లో వివక్షకు గురికావడం బాధాకరమన్నారు. రాజకీయ వెట్టి చాకిరీ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని నర్సయ్యగౌడ్ చెప్పుకొచ్చారు.