తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల మూడో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి బరిలోకి దిగుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు మునుగోడు నియోజకవర్గంలో మకాం వేసి మరి ప్రచారం పర్వంలో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఆ పార్టీకి చెందిన విద్యార్థి విభాగ నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను కట్టెబట్టిన మాదిరిగానే.. మా నల్లగొండ జిల్లా అభివృద్ధికి కూడా ఆ స్థాయిలో నిధులు ఇవ్వండి.. పోటీ నుంచి తప్పుకుంటామని తేల్చిచెప్పారు. ఈ విషయంలో మంత్రి జగదీశ్ రెడ్డి నిన్న చేసిన మాటలకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఆయన యువనాయకులను.. టీఆర్ఎస్వీ నేతలను ఉద్ధేశించి మాట్లాడుతూ “మీలో ఉత్సాహాన్ని, ఉప్పొంగుతున్న జోష్ చూస్తుంటే బరాబర్ మునుగోడులో గెలుస్తామన్న విశ్వాసం కలిగింది. ఉద్యమాల్లో రాటు దేలిన నాయకులు మీరు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఉద్యమంలో బాగా పని చేసింది విద్యార్థి నాయకులు.
ఎన్నికల గురించి, పోరాటాల గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.ఈ దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అవగాహన పెంచుకోవాలి. ప్రజలకు వివరించాలని కేటీఆర్ సూచించారు. మునుగోడు ఉప ఎన్నిక కేవలం ఒక్క కారణంతోనే వచ్చింది. ఒక కాంట్రాక్టర్ బలుపు కారణంగానే వచ్చింది. రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి, ఆయనను లోబర్చుకుని, అవసరమైతే రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే, మునుగోడు ప్రజలను అంగడి సరుకులా కొంటానని నరేంద్ర మోదీ అహకారం ప్రదర్శించారు. ఆ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికనే మునుగోడు ఉప ఎన్నిక అని కేటీఆర్ స్పష్టం చేశారు.