ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక సరదాగా పక్కింటికి వెళ్తే దొంగతనానికి వచ్చావని అవమానించి కొట్టారు. దీంతో బాలిక సూసైడ్ చేసుకొని చనిపోయింది.
కర్ణాటి కోమలేశ్వరి ఏలూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కోమలేశ్వరి తండ్రి చనిపోవడంతో తల్లి పద్మావతి కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల కోమలేశ్వరి పక్కింట్లో కుక్కపిల్లల్ని చూసేందుకు చనువుతో వెళ్లింది. ఆ ఇంట్లో వారు ఆమెను పట్టుకొని దొంగతనం చేయడానికి వచ్చావా అంటూ తిడుతూ కొట్టారు. దీంతో బాధపడ్డ కోమలేశ్వరి అదే రోజు పెదవేగి మండలం రాట్నాలకుంటలో ఉంటున్న నానమ్మ వెంకటరమణ ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి విజయవాడ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 8న కోమలేశ్వరి చనిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.