సిటీలోని ఈసీఐఎల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో గత నెల 21న చోరీ జరిగింది. దొంగలు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 432 సెల్ ఫోన్లు కొట్టేశారు. వాటి విలువ రూ.70 లక్షలు. దీంతో బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆ కేసును కుషాయిగూడ పోలీసులు ఛేదించారు. చోరీ చేసిన ఇద్దర్ని అరెస్టు చేశారు.
ఈసీఐఎల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఝార్ఖండ్‌కు చెందిన షేక్ సత్తార్, అసీదుల్ షేక్ 432 స్మార్ట్ ఫోన్లు చోరీ చేశారు. వీటిలో ఐఫోన్, ఒప్పో, వన్‌ప్లస్, వివో బ్రాండ్ల ఫోన్లు ఉన్నాయి. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కుషాయిగూడ పోలీసులు దొంగలను పట్టుకున్నారు. నిందితులు స్మార్ట్‌ఫోన్లను బంగ్లాదేశ్ తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం వీరి వద్ద నుంచి రెండు ఫోన్లు, రూ.80 వేలు స్వాధీనం చేశారు.
బంగ్లాదేశ్ సరిహద్దుకు 3 కిలో మీటర్ల దూరంలో ఉండే ముఠా ఇలాంటి భారీ చోరీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకులు, బంగారం షాపులు, ఫోన్ల షాపుల్లో చోరీలే టార్గెట్‌గా ఈ ముఠా దొంగతనాలు చేస్తుంది.