జూబ్లీహిల్స్ రోడ్డు నెం. 81లోని హీరో మహేశ్ బాబు ఇంటి ప్రాంగణంలోకి ఓవ్యక్తి మంగళవారం రాత్రి దూకాడు. ఇంటి ప్రహరీ 30 అడుగుల ఎత్తు ఉండడంతో గోడ పైనుంచి దూకగా ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
మంగళవారం రాత్రి 11.30కు మహేశ్ బాబు ఇంటి ఆవరణలో పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే సెక్యూరిటీ గార్డు పరిశీలించగా ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో కనిపించాడు. వెంటనే అతన్ని పట్టుకున్న సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. 30 ఏళ్ల ఆ వ్యక్తి పేరు కృష్ణ అని, మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి వచ్చానని తెలిపాడు. దగ్గర్లోని ఓ నర్సరీలో ఉంటున్నాడని దొంగతనం చేసేందుకు వచ్చి గోడదూకానని చెప్పాడు. గాయాలపాలైన ఆ వ్యక్తిని పోలీసులు ఉస్మానియా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అయితే ఘటన సమయంలో మహేశ్‌బాబు ఇంట్లో ఎవరూ లేరు. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.