సమ్మె కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి తనకు నచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. గాంధీ సత్యాగ్రహం ఎలా చేశారో.. అలానే శాంతియుతంగా సమ్మె చేశారని కొనియాడారు. సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి బాసర ట్రిపుల్ ఐటీని కేటీఆర్ సందర్శించారు. విద్యార్థులతో లంచ్ చేసి వాళ్లతో గడిపారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
‘‘రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా విద్యార్థులంతా మీ అంతట మీరే ఆందోళన చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే సమ్మె చేస్తున్నామని స్పష్టంగా చెప్పారు. ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. విద్యావ్యవస్థను కొవిడ్ అతలాకుతలం చేసింది.
భవన నిర్మాణం చేయడం తేలికైన విషయం. కానీ, అందులో వసతులు కల్పించడం, నిర్వహణ సవాల్‌తో కూడిన అంశం. సంతృప్తికర స్థాయిలో సౌకర్యాలు, వసతులు కల్పించాలని విద్యార్థులు కోరారు. రెండు నెలల తర్వాత సబితా ఇంద్రారెడ్డిని ఇక్కడికి తీసుకొస్తా. నవంబర్‌లో అందరికీ ల్యాప్‌టాప్‌లు ఇస్తాం ’’ అని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.