కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికపై రోజుకో ఆసక్తికర విషయం బయటకు వస్తోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీయే అధ్యక్షుడిగా ఉండాలని కొన్ని రాష్ట్రాల పీసీసీలు ఇప్పటికే ఏఐసీసీకి తీర్మానాలు పంపాయి. రాహుల్ మాత్రం ఎప్పటి నుంచో అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపడం లేదు. తనకు ఆ పదవి వద్దని చెబుతున్నా ఆ పార్టీలోని పెద్దలు, ఇతర ముఖ్యనేతలు మాత్రం ఆయన్ను ఒప్పించే ప్రయత్నాలు చేశారు.
ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ విడుదల చేసింది. అక్టోబర్ 8లోపు నామినేషన్లు స్వీకరించి అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం.. పోటీకి రాహుల్ గాంధీ సుముఖంగా లేకపోవడంతో పలువురు ముఖ్యనేతలు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.
ముఖ్యంగా రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్, ఎంపీ శశిథరూర్, సీనియర్ నేతల కమల్‌నాథ్, దిగ్విజయ్‌సింగ్ తదితరులు పోటీలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. రాహుల్‌ను ఒప్పిస్తామని ఇప్పటివరూ చెప్పుకొచ్చిన అశోక్ గహ్లోత్.. తాజాగా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పార్టీ అధ్యక్షుడి రేసులో ఉండరని.. దీనిపై రాహుల్ క్లారిటీ ఇచ్చారని చెప్పారు. అందరూ రాహుల్‌ను కోరుకుంటున్నా.. ఆయన మాత్రం గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలని భావిస్తున్నారని తెలిపారు.
అశోక్ గహ్లోత్ ప్రకటన నేపథ్యంలో రాహుల్ ఇక ఈ రేసులో లేనట్లే. దీంతో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నేతల సంఖ్య పెరిగే అవకాశముంది. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం ఎక్కువ మంది గహ్లోత్‌వైపే మొగ్గు చూపే అవకాశముంది. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఒకటి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించి అధ్యక్షుడు ఎవరనేది ప్రకటించనున్నారు.