తెలంగాణలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా జరుపుకున్నాం. ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబికేలా 15 రోజులపాటు జరుపుకున్నాం. దానికి కొనసాగింపుగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ తెలంగాణ జాతి స్పూర్తిని ప్రతిబింబించెల మూడు రోజుల పాటు వైభవంగా జరపాలని నిర్ణయించారు.
భారతదేశం ఈ రోజు కన్పిస్తున్న పరిపాలన స్వరూపంలో మునుపు లేదు. స్వాతంత్ర్యం పొందిన సమయంలో దేశం రెండు రకాల పరిపాలన ప్రాంతాలుగా ఉండేది. బ్రిటీష్ వాళ్ళు ప్రత్యక్షంగా పరిపాలించిన బ్రిటీష్ ఇండియా ఒక భాగం. స్వదేశీ రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలు రెండవ భాగం. గాంధీ నెలకొల్పిన సామరస్య విలువల వల్ల, జవహర్ లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం వల్ల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాదుకొల్పిన మతాతీత దేశభక్తి భావనల వల్ల, దేశానికి తొలి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైంది. నేడు చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై నేటితో 74 సంవత్సరాలు నిండి 75 వ సంవత్సరంలోకి అడుగిడుతున్నాం. భారతదేశ బౌగోళిక నిర్మాణంలో తెలంగాణ భాగం పంచుకున్న ఈ రోజును జాతీయ సమైక్యతా దినంగా మనం ఘనంగా జరుపుకుంటున్నాం.తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించింది. ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచిపోయాయి. నేటి సందర్భంలో ఆ ఉజ్వల ఘట్టాలను, ఆనాటి యోధుల వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత. ఆదివాసీ యోధుడు కుమ్రం భీమ్, తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమురయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, వీర వనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, దేవులపల్లి వేంకటేశ్వర్ రావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందాం. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియుద్దీన్, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లాఖాన్ వంటి సాహితీమూర్తులకు ఘనమైన నివాళులర్పిద్దాం. జాతీయ సమైక్యతా అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదు. ప్రజల మధ్య సమైక్యత. విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యత. దేశం అనుసరిస్తున్న జీవనసూత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడమే నిజమైన దేశభక్తి.75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో తెలంగాణ 60 సంవత్సరాల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించింది. గౌరవ ఉద్యమ నేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నేతృత్వంలో 14 ఏళ్ల పోరాటం , అమరుల త్యాగ ఫలితం , 4కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చి నేడు స్వరాష్ట్రమై అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ, అనతికాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చింది.సమైక్యాంధ్ర సంకెళ్ల నుండి విముక్తి పొందిన జూన్ 2వ తేదీన ప్రతీఏటా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం.
అదే విధంగా భారత స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ సందర్భాల్లో మన జిల్లా ప్రగతి ప్రాభవాన్ని సందేశాత్మకంగా వివరించడం జరిగింది. నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను సైతం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. ఈ కీలకమైన సందర్భంలోనూ జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరోసారి నెమరువేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాచరిక పాలన నుండి ప్రజాస్వామిక పాలనలో చేరి 74 సంవత్సరాలు గడిచాయి. కానీ గడిచిన ఎనిమిదేళ్ల స్వరాష్ట్ర పాలనలోనే ఎన్నో లక్ష్యాలను చేరుకున్నాం. ఎన్నో అద్భుతాలను సృష్టించుకున్నాం. నాలుగు దశాబ్దాల పైగా నాన్చివేతకు గురైన సిద్దిపేటకు జిల్లా హోదా దక్కడంతో పాటు పోలీస్ కమిషనరేట్ గా మారింది. స్వరాష్ట్రం సిద్దించిన రెండేళ్లలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్దిపేట ప్రజల చిరకాల వాంఛకు గొప్ప పరిష్కారం చూపించారు.కరువుతో తండ్లాడిన భూముల్లో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తెచ్చి పారిస్తున్నాము. మన జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయకసాగర్, శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. గౌరవెల్లి రిజర్వాయర్ ద్వారా గోదావరి నీళ్లు మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నేలలను స్పృశించడం అద్భుత ఘట్టమనే చెప్పాలి.. ఒక్క పంటకు కూడా నోచుకోని భూముల్లో నేడు రెండు పంటలు పండుతున్నాయి. నీరు సమృద్దిగా ఉన్న ప్రాంతాల్లోనే సాగుచేసే పామాయిల్ తోటలు నేడు సిద్దిపేట జిల్లా నలుమూలలా విస్తరించాయి. ఎటువైపు చూసినా వరి పైరు పచ్చని మాగాణుల్లా వికసిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే ఇది సాధ్యమైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు రైతు ఆత్మ విశ్వాసం నింపేలా రైతు బందు, రైతు కుటుంబాలకు మనో దైర్యం కల్పించేలా రైతు భీమా పథకాలను మన జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నాము..
విద్యారంగంలో మన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉజ్వల ఘట్టాన్ని లిఖించారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 97.85శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం గర్వంగా ఉంది. ప్రభుత్వ విద్యపై విశ్వాసం పెరగడంతో కొత్తగా సుమారు 8వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం పొందారు.జిల్లాలోని 36 గురుకుల విద్యాలయాలు దాదాపు 15వేల మంది విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. సిద్దిపేట జిల్లా విద్యాక్షేత్రంగా అభివృద్ధి చెందుతున్నది. ఇప్పటికే హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్టు కళాశాల, ప్రభుత్వ మెడికల్ కళాశాల,నర్సింగ్ కళాశాల, నలువైపులా పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. త్వరలోనే వెటర్నరీ కళాశాల, ఫార్మసీ కళాశాల, లా కళాశాలు తెచ్చుకోబోతున్నాం.సర్కారు వైద్యమంటేనే సబ్బండ వర్గాల సంక్షేమ వైద్యంగా ఈ ప్రభుత్వం చాటిచెప్పింది. సిద్దిపేట జిల్లాలో ఒకప్పుడు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా హైదరాబాద్‌కు తరలించే పరిస్థితి ఉండేది. నాడు ప్రభుత్వ దవాఖానలను పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ నేడు సిద్దిపేట జిల్లాను ఒక మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుకోవడం జరిగింది. ఎంతటి పెద్ద రోగానికైనా ఇక్కడే చికిత్స అందించేలా వసతులను ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలను తెచ్చుకున్నాం. దీనికి అనుసంధానంగా 950 పడకలతో ఉచిత పెద్దాస్పత్రి త్వరలోనే అందుబాటులోకి రానున్నది. సిద్దిపేట జనరల్ ఆసుపత్రిలో ఉచితంగానే ఎక్స్‌రే, ఈసీజీ, టుడీ ఈకో, అల్ర్టా సౌండ్ స్కానింగ్, మామోగ్రఫీ, డయాలసిస్, సిటి స్కానింగ్, డయాగ్నసిస్ సేవలను నిరాటంకంగా అందించడం జరుగుతున్నది. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.వృద్దులకు ఉచితంగానే కంటి క్యాటరాక్టు సర్జరీలు, మోకీళ్ల మార్పిడీలు చేసి ప్రభుత్వ వైద్యులు కొత్త చరిత్ర సృష్టించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం 650 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఉండగా.. ఈ విద్యాసంవత్సరం నుండే 48 సీట్లతో పీజీ కోర్సులు ప్రారంభం కానున్నయ్. కొత్తగా ఏర్పాటైన నర్సింగ్ కళాశాలలో 100 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఇటీవలే నర్సింగ్ కళాశాలకు 40కోట్ల రూపాయల వ్యయంతో శాశ్వత భవనాన్ని నిర్మించడానికి భూమిపూజ కూడా చేసుకోవడం జరిగింది.గుక్కెడు తాగునీటి కోసం అల్లాడిన సిద్దిపేట జిల్లా ప్రజలకు నేడు శుద్దమైన మంచినీరు అందుతున్నది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసి ప్రతీరోజు తాగునీటి సరఫరా జరుగుతున్నది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ జిల్లాలో 49వేల నల్లా కనెక్షన్లు ఉండగా నేడు 2లక్షల 3వేల నల్లా కనెక్షన్లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. ఇందుకోసం 16వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెట్టింది. సిద్దిపేట పట్టణం చుట్టూ 11 కిలోమీటర్లు వాటర్ రింగ్ మెయిన్ పైపులైను ఏర్పాటు చేసుకోబోతున్నాము. భారతదేశంలోనే రైతులకు ఉచితంగా విద్యుత అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పడం మనమంతా గర్వపడాల్సిన విషయం. విద్యుత సరఫరా విషయంలో ప్రభుత్వానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ప్రజలకు అంతరాయం లేని విద్యుతను అందించడం జరుగుతున్నది. 2014సంవత్సరానికి ముందు ఈ జిల్లాలో 113 విద్యుత సబ్ స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం 170 సబ్‌స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి .గౌరవ ముఖ్యమంత్రి గారి ముందుచూపుతో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఐదు విడతలుగా నిర్వహించుకోవడం జరిగింది. ఫలితంగా తెలంగాణలోని పల్లెల ముఖచిత్రమే మారిపోయింది.
మన సిద్దిపేట జిల్లాలోని 499 గ్రామపంచాయతీల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతీ గ్రామానికి చెత్త సేకరణ కోసం ఒక ట్రాక్టరు సౌకర్యం కల్పించచడం జరిగింది. పట్టణాల దశ,దిశ మార్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రజాప్రతినిధుల సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలోని పట్టణాలు జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు పొందుతున్నాయి. సిద్దిపేట పట్టణానికి 20కి పైగా జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు రావడం మనమంతా గర్వపడాల్సిన విషయం. హుస్నాబాద్, గజ్వేల్ పట్టణాలకూ జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.గుంతల దారులు, మట్టి రోడ్ల స్థానంలో నేడు విశాలమైన తారు రోడ్లు నిర్మించుకున్నాం. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో గ్రామాలకు, మండలాలకు, జిల్లా కేంద్రానికి అనుసంధానంగా రహదారులు ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ ఫలితంగానే జిల్లాలో 286 కిలోమీటర్ల రెండు వరుసల రహదారులు నిర్మాణమయ్యాయి. 22 కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారి, సిద్దిపేట చుట్టూ 74 కిలోమీటర్ల రింగు రోడ్డు, గజ్వేల్ పట్టణం చుట్టూరా 22 కిలోమీటర్ల రింగు రోడ్డు అందుబాటులోకి రానున్నాయి. అదే విధంగా సిద్దిపేట జిల్లా కేంద్రం మీదుగా మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారి, సిరిసిల్ల- జనగామ జాతీయ రహదారి పనులకు నిధుల కేటాయింపు జరిగింది. త్వరలోనే ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి సిద్దిపేట జిల్లాలో 3వేల 700 కిలోమీటర్ల నిడివి గల 795 రహదారులు ఉండగా ప్రస్తుతం 5వేల 376 కిలోమీటర్ల నిడివితో 1 వెయ్యి 18 రోడ్లను అభివృద్ధి చేసుకోవడం జరిగింది.ఒకప్పుడు సిద్దిపేట ప్రాంతానికి పర్యాటక గుర్తింపు లేనేలేదు. వినోదాలు, విహారాల కోసం ఈ జిల్లా వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లడం జరిగేది. కానీ ఇప్పుడు హైదరాబాద్‌తో సహ ఇతర ప్రాంతాల నుండి సిద్దిపేటకు తరలివస్తున్నారు. ఊహించని స్థాయిలో సిద్దిపేట జిల్లా పర్యాటకంగా అభివృద్ధి సాధించింది. కోటిఅందాలతో ముస్తాబైన సిద్దిపేట కోమటిచెరువు, గజ్వేల్‌లోని పాండవుల చెరువు, హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు, దుబ్బాకలోని రామసముద్రం చెరువు, ఐలాండ్‌ను తలపిస్తున్న రంగనాయకసాగర్, కనుచూపుమేర జలసంద్రాలుగా కనువిందు చేస్తున్న మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు.
సిద్దిపేట, గజ్వేల్ పట్టణ శివారుల్లో రూపుదిద్దుకున్న ఆక్సిజన్ పార్కులు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లు. అభివృద్ధితో సమాంతరంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అభాగ్యులకు అండగా నిలవడానికి ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందజేస్తున్నది. జిల్లాలో 1లక్షా 94వేల 917 మందికి ప్రతీనెల 41కోట్ల 40లక్షల రూపాయల పింఛన్ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతున్నది. కొత్తగా మరో 26వేల 646 మందిని ఆసరా పింఛన్ల లబ్దిదారులుగా గుర్తించి వారికి సంక్షేమ సాయం అందించడం జరిగింది. నిరుపేద ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వమే భరోసా కల్పిస్తున్నది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 8వేల 537 మందికి 85కోట్ల 46లక్షల 90వేల రూపాయలు అందించడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జిల్లాకు 15వేల 826 ఇండ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు 12వేల 216 ఇండ్ల నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఇందులో 9వేల 253 గృహ నిర్మాణాలు పూర్తి కాగా 4వేల 702 ఇండ్లలో లబ్దిదారులు గృహ ప్రవేశం చేయడం జరిగింది. త్వరలోనే మిగితా అర్హులకు ఇండ్లు పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్దం చేశాము. వచ్చే దసరా నుండి సొంత స్థలం ఉన్నవారికి 3లక్షల రూపాయలను ఇంటి నిర్మాణం కోరకు ప్రభుత్వం తరపున సాయం అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది.దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరించడంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు ముందువరుసలో ఉన్నారు. దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేసి జిల్లాలో 495 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి 10లక్షల రూపాయల చొప్పున సాయం అందజేసి వారి ఆర్థిక సాధికారతకు బాటలు వేశారు. దశలవారీగా జిల్లాలోని అర్హులందరికీ ఈ పథకం వర్తించేలా ప్రణాళిక రూపొందించడం జరిగింది.ఆనాడు తెలంగాణలో సమస్త జనులు ఏకమై చేసిన పోరాట చరిత్రను వక్రీకరిస్తూ, ఆనాటి త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా మతపిచ్చి మంటలు రేపాలని విచ్ఛిన్నకర శక్తులు కుట్రలు చేస్తున్నాయి. ఈ దశలో మనందరం అప్రమత్తంగా కుట్రలను తిప్పి కొడదాం. వివేకంతో విద్వేషాన్ని ఓడిద్దాం. సకల జనుల విశ్వాసంతో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగిస్తూ, జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్య ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందాం.రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి సమైక్యమై 75 సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికార యంత్రాంగానికి, ఎల్లవేళలా శాంతిభద్రతలను కాపాడుతున్న కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు పోలీస్ సిబ్బందికి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళుతున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా అభివృద్ధికి మనమందరం మరొకసారి పునరంకితం అవుదామని పిలుపునిస్తూ ముగిస్తున్నాను..