ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లా జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం అంతటా చర్చనీయాంశమైంది. పాము పగ పట్టినట్లు ఓ యువకుణ్ని పదేపదే ఒకే చోట కాటేస్తుంది. గత పదిరోజుల్లో ఇప్పటికే 5 సార్లు కాటేసింది.
మన్‌కేఢా గ్రామానికి చెందిన రజత్ చాహర్(20) డిగ్రీ చదువుతున్నాడు. ఈనెల 6వ తేదీ రాత్రి 9 గంటలకు ఇంటి ఆవరణలో నడుస్తుండగా అటుగా వచ్చి ఓ పాము రజత్ ఎడమ కాలిపై కాటేసింది. భయంతో ఆయన కేకలు వేయగా ఇంట్లో వాళ్లు వచ్చి ఆగ్రాలోని ఎస్.ఎన్. వైద్య కళాశాల హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు పాము కాటు లక్షణాలు లేవని పంపించేశారు. తర్వాత 8వ తేదీ సాయంత్రం.. బాత్‌రూమ్‌కి వెళ్లగా అక్కడే ఉన్న పాము మరోసారి ఎడమకాలిపైనే కాటేసింది. ఈసారి ముబారక్‌పుర్‌లోని హాస్పిటల్‌కి తీసుకెళ్లగా డాక్టర్లు వైద్యం అందించారు. తర్వాత మళ్లీ అదేవిధంగా 11, 13,14 తేదీల్లో రజత్‌ను పాము కరిచింది. ప్రతీసారి సమయానికి వైద్యం అందడంతో రజత్ ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. అయితే పాము పగ పట్టినట్లు ఎందుకు రజత్‌నే వెంటాడుతోందో.. ప్రతీసారి ఒకే చోట ఎందుకు కాటేస్తుందో తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.