ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ నుంచి ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సభ్యులను మరోసారి అసెంబ్లీ స్పీకర్ సస్పెన్షన్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న రెండోరోజు ప్రారంభం కాగానే రాష్ట్రంలో ధరల పెరుగుదలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అందుకు అధికారపక్షమైన వైసీపీ ఒప్పుకోకపోవడంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు.
స్పీకర్ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా శాంతించకపోవడంతో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జోక్యం చేసుకున్నారు.రాష్ట్రంలో అనేక కీలక సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని అందుకు సభ్యులుసహకరించాలని కోరారు.
అందుకు ప్రతిపక్ష సభ్యులు ససేమిరా అనడంతో వారిని సభ నుంచి ఒకరోజు సస్పెన్షన్ చేయాలని ప్రతిపా దించగా సభా సభ్యుల అనుమతితో స్పీకర్ టీడీపీ సభ్యులను ఒకరోజుపాటు సస్పెన్షన్ చేశారు.సస్పెన్షన్ అయిన వారిలో ఎమ్మెల్యేలు అశోక్, కింజవరపు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకట్‌రెడ్డి, జోగేశ్వర్‌రావు, పయ్యవుల కేశవ్, గద్దె రామ్మోహన్ రావు, వెలగపుడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, బాలవీరాంజనేయ స్వామి ఉన్నారు.