ట్రైన్ స్టార్ట్ అయిన టైంలో కిటికీ నుంచి ప్రయాణికుడు సెల్‌పోన్ కొట్టేయాలని ప్రయత్నించిన వ్యక్తికి చుక్కలు చూపించాడో ప్రయాణికుడు.. సెల్ కోసం దొంగ పెట్టిన చేయిని ప్రయాణికుడు గట్టిగా పట్టుకొని 15 కిలోమీటర్లు గాల్లోనే వేలాడదీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బీహార్‌లోని బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తోన్న ఓ ట్రైన్ సాహెబ్‌పూర్ కమాల్ స్టేషన్‌లో ఆగినపుడు ఓ వ్యక్తి కిటికీ లోంచి సెల్ ఫోన్ దొంగిలించేందుకు ప్రయత్నించాడు. కానీ గమనించిన ప్రయాణికుడు వెంటనే అతని చేయిని గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో ట్రైన్ మూవ్ అయింది. అయినా పాసింజర్ దొంగ చేయిని వదలలేదు. దొంగ చేయి వదిలేయంటూ ఎంత వేడుకున్నా ప్రయాణికుడు విడిచిపెట్టలేదు. దీంతో ట్రైన్ ప్లాట్‌ఫాం దాటేసింది. దొంగ పట్టుకోసం మరో చేయిని లోపలికి చాచగా.. లోపలున్న వారు అతడి రెండో చేతిని పట్టుకొని పడిపోకుండా కాపాడారు. ఇలా సుమారు 15 కిలోమీటర్లు దొంగ కదులుతున్న ట్రైన్ బయటే గాల్లో వేలాడాడు. చివరకు ఖగారియా స్టేషన్ రావడంతో అతడిని విడిచిపెట్టారు. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు దొంగకు మంచి గుణపాఠం చెప్పారని ప్రయాణికుడిని మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఇలా అన్ని కిలోమీటర్లు కిటికీకి వేలాడదీయడం దారుణమని కామెంట్లు పెడుతున్నారు.