ఉత్తర ప్రదేశ్‌లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. లఖ్‌నవూలోని దిల్‌కుశా ప్రాంతంలో ఓ సైనిక భవనం ప్రహరీ గోడ కూలి ఏకంగా 9 మంది మృతి చెందారు.
ప్రహరీ గోడకు ఆనుకొని కూలీలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఈ భారీ వర్షాలకు గోడ కూలిపోవడంతో 9 మంది అక్కడికక్కడే మరణించగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఉన్నావ్ జిల్లాలో ముగ్గురు..
ఉన్నావ్ జిల్లాలో కురిసిన వర్షాలకు ఓ ఇంటి పైకప్పు కూలి ముగ్గురు చనిపోయారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
సీఎం తీవ్ర విచారం
ఈ ఘటనలపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు.