గోవా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం దిగంబర్ కామత్, విపక్ష నేత మైఖేల్ లోబో సహా 8 మంది కాంగ్రెస్ కి చెందిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన బీజేపీలో చేరారు.
ఈ క్రమంలో కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని… ప్రధాని నరేంద్ర మోదీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు బీజేపీలో చేరామని మైఖేల్ లోబో వెల్లడించారు. 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పంచన చేరడంతో గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 3కు పడిపోయింది.
కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తూ అసెంబ్లీ కార్యదర్శికి మైఖేల్ లోబో సహా పార్టీ మారిన ఎమ్మెల్యేలు లేఖ అందచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, దిలియ లోబో, రాజేష్ పల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సి సెక్విర, రుడోల్ఫ్ ఫెర్నాండెజ్‌లు బీజేపీలో చేరారు.