లోన్‌యాప్‌లలో అప్పులు తీసుకొని సమయానికి తిరిగి చెల్లించకపోవడంతో టార్చర్ చేస్తున్నారు యాప్ నిర్వాహకులు. లోన్ తీసుకున్న వారి కాంటాక్ట్‌లో ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి సదరు వ్యక్తుల్ని నిందిస్తూ తిట్టడం.. ఇష్టానుసారం మెసేజులు పంపడం చేస్తున్నారు. వీరి వేధింపులు భరించలేక చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. సదరు యాప్‌లో లోన్ తీసుకున్న ఓ జంట తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నా రుణయాప్ నిర్వాహకులు పైశాచికత్వం ప్రదర్శించారు. వారి కుటుంబ సభ్యులకు కూడా విడిచిపెట్టకుండా టార్చర్ చేస్తున్నారు.
రాజమహేంద్రవరానికి చెందిన దంపతులు కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆన్‌లైన్ యాప్‌లో లోన్ తీసుకొని అనుకున్న సమయానికి తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో నిర్వాహకులు వారిని తీవ్రంగా వేధించడంతో వారు సూసైడ్ చేసుకున్నారు. లోన్ యాప్ నిర్వాహకులు ఇక్కడితో ఆగకుండా బాధిత కుటుంబ సభ్యులకు రోజూ ఫోన్లు చేస్తూ.. బూతులు తిడుతూ.. వాట్సాప్‌లో మెసేజులు పంపుతున్నారు. రమ్యలక్ష్మి సోదరుడికి ఫోన్ చేసి ఈమె మీకు తెలుసా.. రిప్లే ఇవ్వడం లేదు. మీరూ చనిపోయారా.. అంటూ తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారు. వాట్సాప్ కాల్ చేసి హిందీలో బూతులు తిడుతున్నారని బాధితుడు ఏడుస్తున్నాడు. యాప్ నిర్వాహకులు ఇక్కడితో ఆగకుండా రమ్యలక్ష్మి సోదరి నెంబరుకూ ఫోన్లు చేస్తూ వేధిస్తున్నారు.