బ్రిటన్ దేశపు మహారాణి రెండో ఎలిజబెత్ నిన్న గురువారం కన్నుమూశారు. ఎలిజబెత్ వయస్సు 96 సంవత్సరాలు. రాణి మరణవార్తను ఆమె నివాస భవనం బకింగ్‌హాం ప్యాలెస్ నిన్న గురువారం రోజు సాయంత్రం ప్రకటించింది. బ్రిటన్‌ను అత్యధిక కాలం (70 ఏండ్లు) పరిపాలించిన మహారాణిగా ఎలిజబెత్ చరిత్రకెక్కారు.
రాణి మరణంతో ఆమె కుమారుడు చార్లెస్.. బ్రిటన్‌తోపాటు 14 కామన్వెల్త్ దేశాలకు రాజుగా బాధ్యతలు చేపట్టారు.ఆమె మృతదేహాన్ని ప్రజల సందర్శనార్ధం బకింగ్‌హాం ప్యాలెస్‌కు తీసుకురానున్నారు. తీవ్ర అనారోగ్యం పాలైన ఆమెను స్కాట్లాండ్‌లోని బల్మోరా రాజభవనంలో వైద్య పర్యవేక్షణలో ఉంచారు. వేసవి విడిది కోసం స్కాట్లాండ్ రాజభవనానికి వెళ్లిన క్వీన్ ఎలిజబెత్ అక్కడే తుదిశ్వాస విడిచారు.
ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) గత ఏడాది ఏప్రిల్‌లో కన్నుమూశారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, 20 మంది మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లు ఉన్నారు. రాణి మరణంపై ప్రపంచ దేశాల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బ్రిటన్‌తోపాటు కామన్వెల్త్ దేశాల్లో 10 రోజులపాటు సంతాప దినాలు పాటించనున్నారు. చివరి రోజున మహారాణి అంత్యక్రియలు నిర్వహిస్తారు.