గవర్నమెంట్ హాస్పిటల్‌లో చనిపోయిన ఓ వ్యక్తికి డబ్బులు కోసం వైద్యం చేస్తున్నట్లు తెగ హడావుడి చేస్తారు ఓ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యలు.. ఫైనల్‌గా సారీ మేము చాలా ట్రై చేశాం.. కానీ మీ అన్నయ్య చనిపోయారు.. అని చెప్పాడు ఓ డాక్టర్.. ఏంటిది ఎక్కడో చూసినట్లు.. విన్నట్లు అనిపిస్తోందా.. అదేనండి.. ఠాగూర్ సినిమాలో చాలా ఫేమస్ అయిన హాస్పిటల్ సీన్ ఇది. అచ్చం దీన్నే రిపీట్ చేసేశారు ఆమనగల్లు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు. అసలేం జరిగిందంటే..
తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ డెలివరీ కోసం ఆమనగల్లు పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. ఆదివారం సాయంత్రం ఆమెకు సిజేరియన్ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయింది. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పకుండా మెరుగైన చికిత్స అందించాలని అదే రోజు రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యం అందుతోందని.. కోలుకుంటోందని చెప్పారు. కొద్దిసేపటి తరువాత తమ ప్రయత్నం ఫలించలేదని చనిపోయిందని చెప్పారు. అనుమానం వచ్చి మృతురాలి కుటుంబ సభ్యులు గొడవ చేయగా ఆమనగల్లు ఆసుపత్రి వైద్యులు ఆమె కుటుంబానికి రూ.8 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు అగ్రిమెంట్ కూడా చేశారు.