వైయస్ఆర్ జిల్లా కేంద్రం కడపలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల పిల్లాడ్ని మేనత్త, మామ చిత్రహింసలు పెట్టి చంపేశారు.
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కోనంపేటకు చెందిన శివ సోదరి ఇంద్రజ.. అంజన్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇది నచ్చక శివ సోదరితో మాట్లాడటం మానేశాడు. ఇంద్రజ భర్త అంజన్ కుమార్ కడపలోని ఓ ప్రవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వీరికి కూతురు పుట్టగానే అందరూ కలిసిపోయారు.
గల్ఫ్‌లో తల్లిదండ్రులు
శివ, భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. మూడేళ్ల క్రితం వీరు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిపోయారు. దీంతో పిల్లల్ని నానమ్మ చూసుకుంటుంది. 10 రోజుల క్రితం బంధువుల ఇంట్లో పెళ్లికి ఇంద్రజ, అంజన్ కుమార్ కోనం పేట వెళ్లారు. అక్కడ నుంచి శివ పెద్ద కుమారుడు 10 ఏళ్ల అయాన్‌ను కడపలో చదివిస్తామని చెప్పి ఇంద్రజ, అంజన్ కుమార్ తీసుకెళ్లారు. సోదరి ఇంటికి పంపడం శివకు ఇష్టం లేదు. అయినా ఇంద్రజ తీసుకెళ్లారు. ఇక అప్పటి నుంచి అన్న మీద ఉన్న కోపం, పగను అన్న బిడ్డపై తీర్చుకోవాలని ఆ అభం శుభం ఎరుగని పిల్లాడ్ని చింత్రహింసలు పెట్టేవారు. శనివారం పసివాడి ఒంటిపై కాల్చి, తీవ్రంగా కొట్టడంతో చలనం లేకుండా పడిపోయాడు. దీంతో ఇంద్రజ, అంజన్ కుమార్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారు. దీంతో వారిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నానమ్మ ఇందిరమ్మ ఫిర్యాదుతో ఇంద్రజ, అంజన్ కుమార్లపై కేసునమోదు చేశారు.