అవకాశం దొరికితే చాలు దోచుకునేందుకు సిద్ధంగా ఉంటారు సైబర్ నేరస్థులు.. అలాంటి వారికి దొరికి లక్షలు పోగొట్టుకోవడమే కాకుండా తీవ్ర వేధింపులకు గురయ్యాడు పెళ్లయి పిల్లలు ఉన్న ఓ వ్యక్తి. ఫోన్‌కు వచ్చిన ఓ డేటింగ్ యాప్ లింక్ నొక్కిన తనతో అమ్మాయిలు చాటింగ్ చేస్తున్నారని మభ్యపడి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కాడు. వారి మాటలు నమ్మి నగ్న చిత్రాలను పంచుకున్నాడు. ఇప్పుడు వారి పెట్టే టార్చర్ భరించలేక సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
మియాపూర్‌లోని మయూర్‌నగర్‌లో ఉండే ఓ వ్యక్తి 2020 ఆగస్టులో ఆన్‌లైన్‌లో లొకాంటో పేరుతో ఉన్న ఓ డేటింగ్ యాప్ లింక్ నొక్కాడు. శృతి, మోక్ష పేర్లతో సైబర్ నేరగాళ్లు అతనితో చాటింగ్ చేయడం ప్రారంభించారు. వారి మోజులో పడిన ఆ వ్యక్తి నగ్నచిత్రాలను పంచుకున్నారు. ఇక సైబర్ నేరస్థులు బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఫోటోలు తన భార్య, కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్‌కు పంపిస్తామని బెదిరించారు. సుమారు 70 నుంచి 100 వేర్వేరు నంబర్లతో ఫోన్లు చేసి వేధించారు. అతని ఇన్‌స్టా ఎకౌంట్‌ను హ్యాక్ చేసి తన ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న వారికి పర్సనల్ సమాచారం పంపారు. అతని ఫోన్ నెంబరును వ్యభిచారానికి సంబంధించిన వెబ్‌సైట్లలో ఉంచారు. రకరకాలు వేధించి చివరకు ఆయన నుంచి సుమారు రూ.2.20 లక్షలు కాజేశారు.