బెంగళూరు ఐటీ కారిడార్‌లోని కంపెనీలకు వరదల కారణంగా రూ.225 కోట్ల నష్టం వచ్చినట్లు బెంగళూరు ఔటర్ రింగ్‌రోడ్ కంపెనీస్ అసోసియేషన్ కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు తగినంత మూలధనం లేకపోతే ఇలాగే జరుగుతుందని వ్యాఖ్యానించారు.
‘‘పట్టణ ప్రణాళిక పాలనలో మనకు సంస్కరణలు చాలా అవసరం. నేను చెప్పిన మాటలు చాలా మంది హైదరాబాదీలకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఇదే పరిస్థితి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కొందరు బెంగళూరు నేతలు మనల్ని విమర్శించారు. కానీ ఒక దేశంగా ఎదగాలంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి.
మన నగరాలే దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిస్తాయి. అటువంటి నగరాల్లో మౌలిక వసతులు బాగుండాలి. నాణ్యమైన రోడ్లు, నీరు, గాలి, నీటి నిర్వహణ సదుపాయాలు కల్పించడం పెద్ద కష్టమైన పని కాదు. అందుకు అవసరమైన మూలధనాన్ని కేంద్ర హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ చూసుకోవాలి’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.