తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని సాక్షాత్తూ పార్లమెంటులోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెల్లడించిన కానీ అదే ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి ఉన్న కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహిస్తోన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పదే పదే అబద్ధాలు చెబుతూ అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రైతు ఆత్మహత్యలపై రాష్ట్ర ఆర్థిక& వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇటీవల వెల్లడించిన నిజాలను జీర్ణించుకోలేక, మసిపూసి మారేడు కాయ చేసేందుకు నిన్న శనివారం ఆమె విఫలయత్నం చేయడాన్ని తెలంగాణవాదులు, రైతులు సామాజిక మాధ్యమాల్లో ఎండగట్టారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో రాష్ట్రంలో 1,358 రైతు ఆత్మహత్యలు నమోదు అయ్యాయి. 2020లో అవి 466కి తగ్గాయి అని తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు,మల్కాజీగిరి కాంగ్రెస్ ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డి పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి స్వయంగా చెప్పిన లెక్క ఇది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదికలో సైతం రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్రం తెలిపింది. ఎన్సీబీ నివేదిక ప్రకారం 2021లో రాష్ట్రంలో 359 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
అందులో 303 మంది సొంత భూములు గల రైతులు, మిగిలినవారు కౌలు రైతులు, రైతు కూలీలు ఉన్నారు. దుక్కి దున్నటం మొదలు పంట మార్కెట్‌కు తరలించే వరకు రాష్ట్రప్రభుత్వం రైతన్నకు నిత్యం అండగా ఉండి నడిపిస్తుండటంతో తెలంగాణలో రైతుల జీవితాలు వికసిస్తున్నాయన్నది నిజం. ఇదే సమయంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. యూపీలాంటి రాష్ర్టాల్లో పట్టపగలే అధికార పార్టీ నేతలు కార్లతో తొక్కించి చంపినా అడిగే దిక్కులేకుండా పోయింది.