నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం సాయంత్రం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన వారినుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు.
ఈడీ, సీబీఐని చూసి భయపడొద్దన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తాయని.. శివసేన, ఆర్జేడీ, ఆప్‌ను ఇప్పటికే టార్గెట్ చేశాయన్నారు. కేంద్రం మనపై మరింత దాడి చేస్తుందని, బీజేపీ బెదిరింపులను పట్టించుకోవద్దని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టుగా తెలంగాణలో నడవదని, బీజేపీ మనల్ని ఏం చేయలేదని స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐని మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని సీఎం ఆరోపించారు. మహారాష్ట్రలో బీజేపీ పాచికలు పని చేశాయని, కానీ బిహార్, ఢిల్లీలో విఫలమయ్యాయన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ గల్లంతవుతుందన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం టీఆర్‌ఎస్‌దేనన్న ఆయన.. రెండోస్థానంలో కాంగ్రెస్, బీజేపీ మూడోస్థానానికే పరిమితమవుతుందన్నారు. మనుగోడు సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో 80 స్థానాలు టీఆర్‌ఎస్‌వేనన్నారు. రెండు గ్రామాలకో ఎమ్మెల్యేను ఇన్‌చార్జిగా నియమించనున్నట్లు చెప్పారు. 2022 సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ నెల 6, 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.