జార్ఖండ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా తనకు తానే బొగ్గుగనులను కేటాయించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించి ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలని, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని ఆ రాష్ట్ర గవర్నర్కు సూచించిన సంగతి విదితమే.
అయితే ఈ నేపథ్యంలో సీఎం హేమంత్ సోరెన్ సస్పెన్షన్పై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. విశ్వాస పరీక్ష సిద్ధమయ్యారు. రేపు సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో తన ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. తద్వారా తన ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని నిరూపించుకోనున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుందని, ఈ సందర్భంగా సభలో సీఎం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారని పేర్కొన్నారు.