నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో కొత్తగా మంజూరైన పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి పింఛన్ పొందే అర్హత లేని ఓ వ్యక్తిని చూసి అవాక్కయ్యారు.
నిండా యాభై ఏళ్లు కూడా లేని వ్యక్తిని ఎలా ఎంపిక చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛను ధ్రువపత్రం తీసుకోవడానికి వచ్చిన మరికల్‌కు చెందిన మల్లేశ్ అనే వ్యక్తిని చూసి షాకైన ఎమ్మెల్యే.. నీకు 50 ఏళ్లు కూడా లేవు కదా.. వృద్ధాప్య పింఛను ఎలా వచ్చింది. అని ఆరా తీశారు. ఆ వ్యక్తి ఆధార్ కార్డు చూడగా దానిపై అతని వయసు 61 ఏళ్లుగా ఉంది. దీంతో 42 ఏళ్ల వ్యక్తి ఏజ్ ఆధార్‌లో 61 ఏళ్లగా ఉండడం ఏంటని ఆశ్చర్యపోయారు. ఆధార్ కార్డులో వయసు తప్పుగా నమోదు కావడం, క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించకుండా అనర్హుడికి పింఛను మంజూరు చేయడాన్ని తప్పుపట్టిన ఎమ్మెల్యే అధికారులపై మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.