ఉత్తరప్రదేశ్లోని ధర్మనగరిగా పేరొందిన ప్రయాగ్రాజ్ నగరంలో పవిత్ర గంగానదిలో కొందరు యువకులు చేసిన పనిని సర్వాత్రా అసహ్యించుకుంటున్నారు. సదరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ యువకులు ఏం చేశారంటే..
సాధారణంగా నదిలో పడవపై షికారు అంటే ఆ ఆనందమే వేరు. స్నేహితులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం, సరదాగా గడపడం మామూలే. అయితే కొందరు యువకులు మాత్రం పవిత్రమైన గంగానదిలో పడవలో వెళ్తూ ఏకంగా హక్కా తాగుతూ.. చికెన్ వండుకుంటున్నారు. అంతేకాకుండా జాలీగా సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పవిత్ర స్థలంలో ఏంటా పాడు పనులు అంటూ ఛీ కొడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వీడియోను చూసిన దారాగంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఈ వీడియో దారాగంజ్కి చెందినదేనని తేల్చి నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు.