వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించి రైతు ప్రభుత్వాన్ని తీసుకొస్తారని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవల 26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు వచ్చి తనను కలిశారని.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని చెప్పారు. పెద్దపల్లిలో జిల్లా కలెకర్ట్ కార్యాలయం, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లోకి పోదామా? అని ప్రజల్ని ఆయన అడిగారు. గోల్‌మాల్ ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలేనని సీఎం ఆరోపించారు.
దేశంలో రైతులు పంటల సాగుకు వాడే విద్యుత్ కేవలం 20.8శాతమేనని.. దీనికి అయ్యే ఖర్చు రూ.1.45లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. ఇది కార్పొరేట్ దొంగలకు దోచిపెట్టినంత సొమ్ము కూడా కాదన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలన్న మోదీకే మీటర్ పెట్టాలని వ్యాఖ్యానించారు.
‘‘జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. మీటర్లు లేని విద్యుత్ సరఫరా చేయాలని అడుగుతున్నారు. ఎన్‌పీఏల పేరుతో రూ.12లక్షల కోట్లు దోచిపెట్టారు. రైతులకు ఇవ్వడానికి మాత్రం కేంద్రానికి చేతులు రావడంలేదు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రను భగ్నం చేయాలి. భాజపా ముక్త్ భారత్ కోసం అందరూ సన్నద్ధం కావాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.