సహజంగా దూర్వా అంటే గడ్డిపోచ అని అర్థం. రెండు పోచలున్న దూర్వారాన్ని గణపతికి సమర్పించడం చూస్తుంటాం. పురాణాల ప్రకారం.. అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. లోకాలను పీడించేవాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్లి గణపతితో మొరపెట్టుకుంటారు. అప్పుడు వినాయకుడు.. అనలాసురుణ్ని అమాంతం మింగేశాడు.
అనలం అంటే అగ్ని. ఆ అసురుణ్ని మింగడంతో వినాయకుడు భరించలేని తాపంతో బాధపడసాగాడు.స్వామికి కలిగిన వేడిని ఉపశమింపజేయడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేశారు. పద్మాలను సమర్పించారు, పుష్పార్చనలు చేశారు. ఏకంగా చంద్రుణ్ని తీసుకొచ్చి గణపతి శిరస్సుపై ఉంచారు.
అయినా గణపతికి వేడి తగ్గలేదు. చివరికి పరమశివుడు గరికను తీసుకొని వినాయకుడి శిరస్సుపై ఉంచాడు. దాంతో గణపయ్య తాపం తగ్గింది. అలా వినాయకుడికి, గడ్డిపోచకూ లంకె కుదిరింది. గడ్డిపోచను అందరూ తేలిగ్గా తీసుకుంటారు. కానీ, సృష్టిలో ఏదీ అల్పమైనది కాదని చెబుతూ స్వామి గరికను ఇష్టంగా స్వీకరిస్తాడని కొందరి భావన. అందుకే దూర్వాయుగ్మంతో గణపతిని ఆరాధిస్తే స్వామి ప్రసన్నుడై, శీఘ్ర ఫలితం ఇస్తాడని విశ్వసిస్తారు.