సెలవు అనే మాట వినగానే స్కూలు పిల్లలకే కాదు ప్రైవేట్ సర్కారు ఉద్యోగులకు కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆదివారాలు కాకుండా అప్పుడప్పుడూ వచ్చే పబ్లిక్ హాలిడేస్ పాయసంలో జీడిపప్పులా మహదానందాన్ని ఇస్తాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రానున్న దుర్గాపూజ నేపథ్యంలో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 దాకా, అంటే పదకొండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు మొత్తంగా దుర్గాపూజ జరిగే నెలలో 22 రోజులు సెలవులు తీసుకొనే వెసులుబాటు కల్పిస్తున్నది.
ఈ సెలవుల సంఖ్య గతేడాది 16గా ఉంది. ఈ నేపథ్యంలో మన దేశంలో ఏయే రాష్ట్రాలు ఎన్ని సెలవులు ఇస్తున్నాయో ఓ లుక్కేద్దాం.దేశంలో అతి తక్కువ పబ్లిక్ హాలిడేస్ ఉన్న రాష్ట్రం ఢిల్లీ (14 రోజులు) కాగా, ఆ తర్వాతి స్థానంలో బిహార్ (15) నిలిచింది. తర్వాత కర్ణాటక (16) ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ సెలవుల సంఖ్య 28 రోజులుగా ఉంది. అత్యధికంగా సెలవులు కలిగిన రాష్ట్రంగా ఒడిశా (34 రోజులు) నిలిచింది. తర్వాతి స్థానంలో ఝార్ఖండ్ (33), అసోం (32), హిమాచల్ ప్రదేశ్ (32)లు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో 28 ఉండగా ఇప్పుడు ఇవ్వనున్న 22 రోజులు దీనికి అదనం. కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్యరాష్ర్టాలు మినహాయిస్తే మిగిలిన 24 రాష్ర్టాల సగటు సెలవుల సంఖ్య 25 రోజులుగా ఉంది. ఇందులో 20 రోజుల కన్నా తక్కువ రోజులు సెలవులు ఉన్న రాష్ర్టాలు ఐదు ఉన్నాయి. అంటే కొన్ని జాతీయ సెలవులు మినహా ఆయా ప్రాంతాల ఆచారాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు నిర్ణయిస్తున్నాయి. భారత సంస్కృతిలో ఉండే భిన్నత్వమే వీటిలోనూ కనిపిస్తున్నది కదూ!