Home / SLIDER / దేశాన్ని ఉన్మాదంలోకి నెట్టే కుట్ర

దేశాన్ని ఉన్మాదంలోకి నెట్టే కుట్ర

75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకొంటున్న ఈ నేపథ్యంలో దేశాన్ని ఒక ఉన్మాద స్థితిలోకి నెట్టే కుట్ర జరుగుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విష సంస్కృతిని చూస్తూ ఊరుకొంటే అది దేశానికే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. సోమవారం లాల్‌బహదూర్‌ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, జాతీయ పతాకాన్ని ఆవిషరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వతంత్ర భారత స్ఫూర్తిని ఈ తరం పిల్లలకు, యువతకు తెలియజెయ్యాలనే గొప్ప ఉద్దేశంతోనే వజ్రోత్సవాలు చేపట్టామన్నారు.

గాంధీ జీవితం.. నేటితరానికి తెలియాలి
————————————
అహింసా మార్గం ద్వారా ఎంతటి శక్తిమంతులనైనా జయించవచ్చన్న సందేశమిచ్చిన మహాత్మాగాంధీ పుట్టిన గడ్డ మన దేశమని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. అటువంటి మహాత్ముడి గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉన్నదన్నారు. మనకు స్వాతంత్య్రం ఊరికే రాలేదని, అమూల్యమైన త్యాగాలు, బలిదానాలు జరిగితేనే సిద్ధించిందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న త్యాగధనులకు శిరస్సు వంచి జోహార్లు అర్పిస్తున్నానని చెప్పారు. ఉజ్వల స్వాతంత్య్రం, 75 ఏండ్లుగా స్వతంత్ర భారతంలో జరుగుతున్న విషయాలను గుర్తుచేసుకొంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని యువకులు, మేధావులు గ్రహించాలని కోరారు. ‘75 ఏండ్ల తరువాత కూడా దేశంలో పేదల ఆశలు నెరవేరని పరిస్థితులు ఉన్నాయి. అడుగు వర్గాల ప్రజల్లో ఆక్రోశం ఇంకా వినిపిస్తున్నది. అనేక వర్గాల ప్రజలు తమకు స్వాతంత్య్ర ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వాటిని విస్మరించి దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేందుకు కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. చూస్తూ మౌనం వహించడం సరైనది కాదు. అర్థమై కూడా అర్థం కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారాలి. ఏ సమాజాన్ని అయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తామో.. ఆ సమా జం గొప్పగా పురోగమించేందుకు వీలుంటుంది. అద్భుతమైన వనరులున్న ఈ దేశం అనుకున్న విధంగా పురోగమించడం లేదు. కులం, మతం, జాతి అనే భేదం లేకుండా.. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరంపై ఉన్నది’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

గాంధీ సినిమా ప్రదర్శన, జాతీయ గీతాలాపనలతో ఎంతో సంతృప్తి…
———————————————–
స్వతంత్ర వజ్రోత్సవాల్లో రెండు గొప్ప సన్నివేశాలు తనకు సంతృప్తినిచ్చాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. సామూహిక జాతీయ గీతాలాపన రాష్ర్టానికే గర్వకారణన్నారు. ఏకకాలంలో కోటిమంది జాతీయ గీతాన్ని ఆలపించడం గొప్పవిషయమని చెప్పారు. గాంధీ సినిమాను 22 లక్షల మంది ఈ తరం పిల్లలు చూశారని, అందులో 10%మందికి స్ఫూర్తి కలిగినా ఈ దేశం పురోగమించడానికి తమ శక్తి సామర్థ్యాలు వినియోగిస్తారని ఆకాంక్షించారు. గాంధీ మార్గంలో దేశం పురోగమించాలని, ఆయన అహింసా సిద్ధాంతాన్ని ఉపయోగించుకొనే తెలంగాణ సాధించామని పేర్కొన్నారు. మహాత్ముడు విశ్వ మానవుడని, కొందరు అల్పులు ఆయన గురించి నీచంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఏ దేశానికి వెళ్లినా ఇండియా అంటే చాలు, గాంధీ దేశం నుంచి వచ్చావా? యూ ఆర్‌ గ్రేట్‌ అంటూ స్వాగతిస్తారని, గాంధీ లైబ్రరీలు, జీవిత విశేషాలు, విగ్రహాలు విదేశాల్లో ఉన్నాయంటే అదే భారతదేశానికే గర్వకారణమని కొనియాడారు. కేశవరావు ఆధ్వర్యంలోని కమిటీ అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసిందని తెలిపారు. ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించడంతో ఈ వేడుకలపై పల్లె నుంచి పట్టణం వరకూ ప్రతిఇంట్లో చర్చ జరిగిందని పేర్కొన్నారు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వజ్రోత్సవాల కమిటీ చైర్మన్‌ కేశవరావు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తోపాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజలు అందరికీ పేరుపేరునా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat