ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భేటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్ హోటల్లో ఆదివారం రాత్రి వాళ్లిద్దరూ కలిశారు. రాజకీయాలపై మాట్లాడుకున్నారా? సినిమాలపైనా? ఇంకైమైనా కారణాలా? అనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజంగా రాజకీయాలపైనే అయితే గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఎన్టీఆర్ ఏం చెప్పారు? ఇలా.. అనేక అంశాలపై ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ మంత్రి, ఎన్టీఆర్‌కు సన్నిహితుడు కొడాలి నాని స్పందించారు.
రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించుకోవడానికి ప్రధాని మోదీ, అమిత్‌షా ఎన్నో వ్యూహాలతో ముందుకెళ్తుందని.. దానిలో భాగంగానే ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీ అయ్యారని చెప్పారు. పాన్ ఇండియా స్టార్‌గా ఎన్టీఆర్ క్రేజ్ పెరిగిందని.. తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన సేవలను వినియోగించుకోవడానికి ఈ భేటీ జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
సినిమాల గురించి ప్రశంసించడానికే ఎన్టీఆర్‌ను అమిత్‌షా పిలిపించుకున్నారనే ప్రచారాన్ని నేను నమ్మడం లేదన్నారు. బీజేపీకి రాజకీయంగా ఉపయోగడకుంటే ఒక్క నిమిషం కూడా మోదీ, అమిత్‌షా ఎవర్నీ కలవరని కొడాలి నాని వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యూహంలో భాగంగా వాళ్లిద్దరూ కలిసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.