ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే.. రైతు, ప్రజావ్యతిరేక విధానాలే ప్రధాని మోదీకి శత్రువు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ప్రజా ఆశీర్వాద సభలో కేంద్రంలోని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వైఖరిపై ధ్వజమెత్తారు. వ్యవసాయ కరెంటు మోటార్లకు కేంద్రం ఎందుకు మీటర్లు పెట్టమంటున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. కారణాలు ఏంటో చెప్పాలని నిలదీశారు. ‘ఎదుకు పెట్టమంటున్నవ్ మీటర్.. ఏం కారణం.. నిన్ను మేం అడుగుతలేమే.. నిన్ను బతిమిలాడినమా పైసలు ఇవ్వమని. ఇదే నల్లగొండ జిల్లా, పాలమూరు, అనేక ఇతర జిల్లాల్లో పది, ఇరవై ఎకరాలు ఉన్నవాళ్ల హైదరాబాద్‌కు వచ్చి ఆటోలు నడిపారు. ఆ రోజు ఏడ్చాం.. బాధపడ్డాం.. మా ప్రాజెక్టులు కాలే.. మాకు నీళ్లు రాలే.. కరెంటు రాదు.. చెట్టుకొకరు గుట్టకొకరు అయ్యారు రైతాంగమంతా.. ఇవాళ ఏ ప్రయత్నమన్న చేసే మళ్లీ గ్రామాలు పచ్చబడాలే.. రైతులు బాగుపడాలే.. గ్రామం సల్లగుంటే.. రైతు వద్ద నాలుగు పైసలు ఉంటే.. రైతు ధాన్యంపండిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని తిప్పలు పడుతున్నం. రైతుబంధు పెట్టుకున్నం. నీళ్లు ఇచ్చుకుంటున్నం. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నం’ అన్నారు.
కండ్లు మండుతున్నయ్..
‘ఇవాళ కొద్దికొద్దిగా ఇప్పుడిప్పుడే జరజర తెల్లపడుతున్నమ్.. తెలంగాణకు జరజర తెలివి వస్తున్నది.. కండ్లు మండుతున్నయా? దమ్ముంటు నువ్వు ఉన్నకాడ చెయ్. అక్కడ చేసుడు చేతకాదు. మొన్న నేను అడిగినా.. ఢిల్లీలో లేదు కరెంటు.. హైదరాబాద్‌లో ఉంటది.. మేం ఇంతపొడువు, అంతపొడువు చేసినం అంటరు.. దేశ రాజధానిలోనే మంచినీళ్లు దిక్కులేవు.. నీళ్లు సక్కరావు.. ఇదీ వీళ్ల పరిపాలన.. ఎవరినైనా ఉద్దరించారా? నీళ్లు రావు.. కరెంటు రాదు.. సాగునీరు రావు.. ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? దేశంలే.. కట్టలే.. మాకు చేయ చేతకాదు.. నువ్వు చేస్తే చేయనియ్యం అనే పద్ధతిలో మాట్లాడుతున్నరు.. భారతదేశంలో 24గంటలు మోటర్, ట్రాన్స్‌ఫార్మర్ కాలకుండా మంచి నాణ్యమైన కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. బీజేపీ పరిపాలించే కాడ లేదు.. ప్రధానమంత్రా సొంత రాష్ట్రం గుజరాత్‌లో లేదు. ఇవాళ కరెంటు కూడా బంద్ చేస్తరటా.. మీటర్ పెట్టాలే.. వచ్చే కరెంటు రాకుంట బంద్ చేయాలే.
అబద్ధాలు చెప్పాలే.. అబద్ధాలు మాట్లాడాలే.. దేశ ప్రజానీకానికి, రైతాంగానికి నిష్కృతిరావాలంటే.. ఈ డూప్లికేట్ అవసరం లేని ఉప ఎన్నికలు తెచ్చే గోల్‌మాల్‌గాళ్ల నుంచి మనన్ని మనం కాపాడుకోవాలంటే మన బాయికాడ, బోరుకాడ బీజేపీ మీటర్ పెట్టుడు కాదు.. అందరం ఒక్కటై బీజేపీకే మోటార్ పెట్టాలే. మన పీడపోతదని నేను మనవి చేస్తున్నా’ అని అన్నారు. పెడుదామా బీజేపీకి మీటరు?.. పక్కా మాటేనా?..’ అని సీఎం కేసీఆర్ అనగా.. పెడుదాం అంటూ జనం నినదించారు. ‘మీరు ఒక్కొక్కరు ఒక్క కేసీఆర్ కావాలే.. కొందరు మనదాంటో సన్నాసులు ఉంటరు.. కొంద మందుపెట్టి దూది పెట్టగానే దాని వెంబడిపోతరు. దానికి ఆశపడద్దు. దయచేసి ప్రలోభాలకు పోవద్దు.. ఒక్కటే మాట చెబుతున్న పార్టీల ఎన్నిక కాదు.. రైతుల బతుకుదెరువు ఎన్నిక. రైతుల పొలాల్లో పని చేసే కార్మికుల బతుకుదెరువు ఎన్నిక. తెలంగాణ యొక్క జీవితం.. ఇది మంచిది కాదు’ అన్నారు.
రూపాయి విలువ పడిపోతుంది..
‘దేశంలో మతపిచ్చి, కులపిచ్చి మంచిదా? ఎవరిని ఉద్దరించడానికి, ఎవర్ని బాగుచేయడానికి? అందరూ
బాగుండాలి.. అందులో మనం బాగుండాలని కోరుకోవాలి కానీ.. ఒక విద్వేషం.. అసహ్యం పుట్టిస్తే.. ఇవాళ దేశంలో ఏం జరుగుతోంది.. చాలా ప్రమాదంలోకి వెళ్తోంది. రూపాయి విలువ ఏ ప్రధాని టైమ్‌లో పోలే ఇంత అధ్వాన్నంగా? 80 రూపాయలా? ఇదే ప్రధాని మోదీ చెప్పిండు.. నన్ను గెలిపించండి.. రూపాయి విలువ అధమ స్థాయికి పడిపోయింది మోదీ పాలనలోనే. నిరుద్యోగం పెరిగింది. కార్మికులు రోడ్డునపడుతున్నరు. ఉన్న సంస్థలను అమ్ముతున్నరు. రైతులను బతుకనిస్తరలేదు. పండిన పంటలను కొంటలేరు. మనదగ్గర మనం తిప్పలు పడుదామంటే కూడా.. ఇది కూడా బంద్ పెట్టాలే.. దీన్ని కూడా కొండిపెట్టాలే..
ఇవాళ రేపు బంద్ చేస్తరో మీరు అడగాలే.. ఓ గంటా? రెండు గంటలు కరెంటు పోతే ఎంత బాధైతది? కష్టపడి.. ఎన్నోరకాల బాధలుపడి కొన్ని ఖర్చులు తగ్గించైనా సరే బ్రహ్మాండంగా కరెంటు ఇచ్చుకుంటున్నం.. పరిశ్రమలు వస్తున్నయ్. పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతున్నయ్. ఐటీ పరిశ్రమ పెరుగుతున్నది. వ్యవసాయంలో పంటలు బాగా పండుతున్నయ్. ఎవరికి అక్కర ఉన్నప్పుడు వారు బోరు పెట్టుకుంటున్నరు. ఆనందంగా సంతోషంతో బతుకుతున్నరు. బతుకనియ్యం.. చెడగొడుతం అంటున్నరు.. మళ్లీ చండూరు కూడా సభ పెట్టుకుందాం. మీ దీవెన ఉన్నంత వరకు.. కేసీఆర్ బతికున్నంత వరకు తెలంగాణ రైతాంగానికి మీటరు పెట్టను.. ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు ఆగదు’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.