కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీలు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ మునుగోడులో గెలిచేందుకు అన్ని ప్రయత్నాలూ ముమ్మరం చేశాయి.
దీనిలో భాగంగానే టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మునుగోడులో ‘ప్రజాదీవెన’ బహిరంగ సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి మునుగోడు వరకు భారీ ర్యాలీతో సీఎం వెళ్లేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ప్రగతిభవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. మునుగోడు వరకు కొనసాగనుంది.
పార్టీ శ్రేణులతో కలిసి కేసీఆర్ బస్సులో వెళ్తుండగా.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు, కార్యకర్తలు ఆయన్ను అనుసరిస్తున్నారు. ప్రగతి భవన్ నుంచి ఉప్పల్, ఎల్బీనగర్, పెద్ద అంబర్‌పేట మీదుగా మునుగోడు వైపు సీఎం ర్యాలీ కొనసాగనుంది.
సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి మునుగోడు వరకు పలు జంక్షన్లలో టీఆర్‌ఎస్ పార్టీ భారీగా ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేసింది. సీఎం పర్యటన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ టీఆర్‌ఎస్ కార్యకర్తలు మాంచి జోష్‌లో ఉన్నారు.