తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు అధికార టీఆర్ఎస్ పార్టీకి శుభసంకేతం ఇది. టీపీసీసీ అధ్యక్షుడు… మల్కాజీగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిపై ఆది నుండి తీవ్ర వ్యతిరేకత ఉండటమే కాకుండా కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన బంపర్ ఆఫర్ కు లోంగి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
అయితే రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డిల పంతాలకు, బీజేపీ స్వీయబలపరీక్షకు ఫలంగా జరగబోతున్న మునుగోడు ఉపఎన్నిక సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ అయిన సీపీఐ అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించడం ఆ పార్టీ అభ్యర్థి విజయావకాశాలు పట్ల ఆశలు పెంచేదే. నిన్న శుక్రవారం ఆ పార్టీ నేతలు గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు.నల్లగొండ జిల్లా అంటే విప్లవాలకు కొండ. అందులో మునుగోడు ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు కంచుకోటగా ఉండేది. రానురాను ప్రాంతీయపార్టీలు బలపడటం, జాతీయస్థాయిలో బీజేపీ అంకురించడం, ఇంకా అనేక స్వీయ తప్పిదాల కారణంగా కమ్యూనిస్ట్ పార్టీలు వెనుకబడినప్పటికీ ఆ నియోజకవర్గంలో ఇరవై వేల వరకు కమ్యూనిస్ట్ పార్టీలకు ఓటుబ్యాంక్ ఉన్నది.
అలాగే మజ్లీస్ పార్టీని అభిమానించేవారు టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తారు.మూడున్నరేళ్లుగా నియోజకవర్గం ముఖమే చూడని రాజగోపాల్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుక్కుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీని విధ్వంసం చెయ్యడానికే రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుని బలమైన కాంగ్రెస్ సీనియర్ నాయకులను బయటకు పంపిస్తున్నారని, బీజేపీతో ఆయనకు రహస్యసంబంధాలు ఉన్నాయని రాష్ట్ర రాజకీయాల్లో పలు అనుమాలు రేకెత్తిస్తున్నాయి.
ఈ ఉపఎన్నిక దగ్గర పడుతుండే కొద్దీ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఎక్కువ కావడం, సీనియర్ నాయకులు పరస్పరం దారుణమైన ఆరోపణలు చేసుకోవడం చూస్తుంటే కాంగ్రెస్ అభ్యర్ధికి డిపాజిట్ కూడా దక్కకుండా రేవంత్ రెడ్డి కర్తవ్యదీక్షలో మునిగిపోయి మునుగోడులో కాంగ్రెస్ ను నిలువునా ముంచెయ్యడం ఖాయం అంటున్నారు.ఇక బీజేపీకి అమిత్ షా వచ్చినా, మోడీ వచ్చినా, మునుగోడులో డిపాజిట్ కూడా దక్కదని నియోజకవర్గ ఓటర్ల అభిప్రాయం. గెలిస్తే మాత్రం అది ఒక మహాద్భుతమే అవుతుంది.ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో బహిరంగసభను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభానంతరం మునుగోడులో టీఆరెస్ అభ్యర్థి గెలుపు అనేది నల్లేరు మీద బండి నడకే అవుతుంది