మరో బాదుడుకు ప్రజలు సిద్ధమవ్వాల్సిందేనా? ఇప్పటికే జీఎస్టీ, ఇతర పన్నులతో సతమతమవుతున్న సగటు వినియోగదారుడిపై ఆర్బీఐ రూపంలో మరో భారం వేయనుందా? దీనికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డులపైనే అదనపు భారం ఉండగా.. ఇకపై యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) పేమెంట్స్‌కు కూడా ఛార్జీల రూపంలో కొంత వసూలు చేయాలని ఆర్బీఐ భావిస్తోంది.
నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్, యూపీఐ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. పాకెట్లో రూపాయి లేకపోయినా కావాల్సిన వస్తువులకు అయ్యే డబ్బును స్కాన్ రూపంలో యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాం. ఇకపై అలా చేసే పేమెంట్స్‌కు కూడా ఛార్జీలు పడే అవకాశముంది. దీనిపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా ఆర్బీఐ ఓ డిస్కషన్ పేపర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలు దీనిపై అభిప్రాయాలు, సూచనలు చెప్పాలని కోరింది.
యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు వసూలు చేస్తే ఆయా సంస్థలు మరింత క్వాలిటీతో సేవలు అందిస్తాయని ఆర్బీఐ భావిస్తోంది. ఇదే గనుక అమల్లోకి వస్తే మాత్రం యూపీఐ ట్రాన్సాక్షన్‌చేసే వినియోగదారుడు ఇకపై అదనంగా కొంత ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది. దీన్ని మెజారిటీ ప్రజలు వ్యతిరేకించే అవకాశముంది.