కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సారీ చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోని చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగసభలో పార్టీ నేత అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వెంకట్‌రెడ్డిని ఉద్దేశిస్తూ దయాకర్ పరుష పదజాలాన్ని వాడారు. దీన్ని ఆ పార్టీలోని కొంతమంది సీరియస్‌గా పరిగణించారు. అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని దయాకర్‌ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ వ్యవహారంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ పీసీసీ అధ్యక్షుడు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ నేడు ఓ వీడియో విడుదల చేశారు. దయాకర్ వాడిన భాష ఎవరికీ మంచిది కాదని.. ఈ విషయంలో వెంకట్‌రెడ్డికి పీసీసీ అధ్యక్షుడిగా బేషరుతుగా సారీ చెప్తున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు అద్దంకి దయాకర్ కూడా తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. ఆయన కూడా ఓ వీడియలో రిలీజ్ చేశారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చిందని.. దానిపై తన వివరణ ఇచ్చి క్షమాపణలు కోరినట్లు తెలిపారు.