దేశ సంపదను పెంచే తెలివితేటలు ప్రధాని మోదీ ప్రభుత్వానికి లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. సంపదను పెంచి పేదలక సంక్షేమానికి ఖర్చు చేసే మనసు వారికి లేదన్నారు. ఉచిత పథకాలు వద్దంటూ ఇటీవల ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
పేదల పొట్ట కొట్టేందుకే ఉచిత పథకాలపై చర్చకు తెరతీశారని కేటీఆర్ విమర్శించారు. పేదల వాళ్ల కోసం తీసుకొచ్చిన పథకాలపై ఎందుకంత అక్కసు? అని నిలదీశారు. ‘‘అసలు మీ దృష్టిలో ఉచిత పథకాలంటే ఏమిటి? పేదలకు ఇస్తే ఉచితాలా? పెద్దలకిస్తే ప్రోత్సాహకాలా? బడుగు బలహీన వర్గాల ప్రజలే మీ టార్గెటా? కాకులను కొట్టి గద్దలకు వేయడమే మీ విధానమా? నిత్యవసర వస్తువుల మీద జీఎస్టీ బాదుడు.. ఆఖరికి పాలు, పెరుగుపైనా జీఎస్టీ.. కార్పొరేట్లకు పన్ను రాయితీలా? రైతు రుణమాఫీ వద్దు.. కార్పొరేట్ రుణాల మాఫీ ముద్దా?’’ అంటూ మోదీని ఉద్దేశించి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దేశంలో పేదరికం పెరిగిపోయిందని.. నైజీరియా కంటే ఎక్కువ మంది పేదలున్న దేశం అపకీర్తి గడించామని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం రూ.80లక్షల కోట్ల అప్పు తెచ్చి ఎవరిని ఉద్దరించిందని నిలదీశారు. తెచ్చిన అప్పుతో ఒక్క భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు అయినా కట్టారా? పేదల కడుపునింపే ఒక్క సంక్షేమ పథకమైనా తెచ్చారా? అంటూ కేటీఆర్ దుమ్మెత్తి పోశారు.