చండూరు సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సారీ చెప్పినా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శాంతించేలా కనిపించడం లేదు. అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించిన తర్వాతే రేవంత్ చెప్పిన సారీపై ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా రేవంత్ సారీ చెప్పిన అంశాన్ని మీడియా ప్రతినిధులు కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ విధంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమకారుడినైన తనను అవమానించారని.. సభలో పరుష పదజాలం వాడిన అద్దంకి దయాకర్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
సభకు అధ్యక్షత వహించినందున రేవంత్ కూడా సారీ చెప్పాలని శుక్రవారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ సారీ చెప్పారు. అయినప్పటికీ కోమటిరెడ్డి వెనక్కి తగ్గడం లేదు. ఈ పరిణామాలు చివరికి ఎటు దారితీస్తాయో చూడాలి.