తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించడంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం అయింది.
అయితే ఈ ఉప ఎన్నిక రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త రగడకు తెరలేపింది. ఉప ఎన్నికలో బరిలోకి దిగే అభ్యర్థులు ఎవరో తెలడానికి అవసరమైన టికెట్ పంచాయితీ ఆ పార్టీలో తారస్థాయికి చేరింది. ఉప ఎన్నికల్లో పోటికి టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు.. ఎవరికివారుగా అధిష్ఠానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇస్తే తమకే టికెట్ ఇవ్వాలని.. లేదంటే సహాయ నిరాకరణ తప్పదని స్పష్టంచేస్తున్నారు. దీనికితోడు చెలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు చేశారంటూ వస్తున్న వార్తలపై పాల్వాయి స్రవంతి తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ కార్యకర్తతో మాట్లాడిన ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది. కాంగ్రెస్‌కు మునుగోడులోని పరిస్థితులు ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న నలుగురు అభ్యర్థులను ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు బుధవారం గాంధీభవన్‌కు పిలిపించి మాట్లాడారు.