త్రివర్ణ పతాకం భారతదేశానికే గర్వకారణం. మనమందరం గర్వపడేలా ఈ జెండాను తయారుచేసింది తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య. 1906లో కలకత్తాలో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశాల ప్రారంభ సమయంలో బ్రిటిష్ వారి జాతీయ జెండాను కాంగ్రెస్ నాయకులు ఆవిష్కరించడం చూసి పింగళి వెంకయ్య కలత చెందారు. మహాత్మాగాంధీ వెన్నుతట్టగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు.
పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని కృష్ణా జిల్లాలోగల మచిలీపట్నం వద్ద భట్లపెనుమర్రులో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి పింగళి హనుమంతరాయుడు, తల్లి వెంకటరత్నం. ఆయన బాల్యం, విద్యాభ్యాసం చల్లపల్లి మండలం యార్లగడ్డ, మొవ్వ మండలం భట్లపెనుమర్రు, మోపిదేవి మండలం పెదకళ్లపేల్లిలో జరిగింది. అనంతరం మచిలీపట్నం హిందూ హైస్కూలులో ప్రాథమికోన్నత విద్యను పూర్తిచేశారు.
1921లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి వచ్చిన మహాత్మాగాంధీని పింగళి వెంకయ్య కలిశారు. ఖద్దరుపై తాను రూపొందించిన ‘స్వరాజ్’ పతాకాన్ని మహాత్ముడికి అందజేశారు. అందులో ఎరుపు, పచ్చ రంగులు మాత్రమే ఉన్నాయి. గాంధీ సూచన మేరకు మధ్యలో స్వరాజ్యానికి గుర్తుగా చరఖాతోపాటు తెల్ల రంగును కూడా కలిపి మూడు గంటల్లో మరో పతాకాన్ని వెంకయ్య తయారుచేశారు. ఆ పతాకాన్ని గాంధీజీ, కాంగ్రెస్ అగ్ర నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. 1947లో స్వాతంత్య్రం వచ్చాక బాబూ రాజేంద్రప్రసాద్ సారథ్యంలో జాతీయ పతాక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ చరఖా స్థానంలో అశోక చక్రాన్ని ఆమోదించింది.