వాట్సాప్‌లో మనం ఒకరికి మెసేజ్ పంపితే వాళ్లు చూశాకే డిలీట్ చేసే వ్యూ వన్స్ మెసేజస్‌ను ఇకపై స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం కుదరదని చెబుతోంది ఆ సంస్థ. త్వరలో ఈ స్క్రీన్ షాట్ తీసే ఆప్షన్‌ను బ్లాక్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్ మాతృసంస్థ మెటా. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎక్స్‌పెరిమెంట్స్ జరుగుతున్నట్లు తెలిపారు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్. ప్రస్తుతం కొందరు మెసేజస్ చదివిన వెంటనే స్క్రీన్ షాట్స్ చేస్తుంటారు. ఇకపై అలా జరగకుండా ఇద్దరి మధ్య చాటింగ్‌కు ఎక్కువ సెక్యూరిటీ ఉండేలా చేయడమే ఈ అప్డేట్ ముఖ్య ఉద్దేశం అని చెప్పారు.
అడ్మిన్‌కే తెలిసేలా..
ప్రస్తుతం ఒక గ్రూప్‌లో ఎవరైనా ఎగ్జిట్ అయితే గ్రూప్‌లో ఉండే అందరికీ తెలుస్తుంది. ఇకపై అలా కాకుండా కేవలం అడ్మిన్‌కు మాత్రమే తెలిసేలా చేయనున్నారు. అంతేకాకుండా ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో ఉన్నట్లు ఎవరికైతే తెలియాలి అనుకుంటారో వారికే తెలిసేలా మనమే సెట్టింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇవన్నీ ఈ నెలలోనే యాజర్స్‌కి అందుబాటులోకి వస్తాయని వాట్సాప్ సంస్థ తెలిపింది.