ఆమె ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఏడో తరగతితోనే చదువు ఆపేసి ఓ బ్యాంక్ బుక్ బైండర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. కొడుకు పుట్టాడు. ఇక అంతా బాగుంటుంది అనుకునేలోపే విథి చిన్నచూపు చూసింది. భర్త ఓ ప్రమాదంలో మరణించాడు. పసిబిడ్డతో ఒంటరిగా మిగిలింది. ఉద్యోగం చేసేంత చదువు లేదు. చివరకు బిడ్డను పోషించుకునేందుకు భర్త పని చేసిన బ్యాంకులోనే స్వీపర్‌గా పనిచేసింది. కేవలం వందలోపే జీతం ఉండడంతో అది సరిపోక వేరే వేరే చోట్ల పని చేసింది. ఇలా ఉంటే ఇక జీవితం గడవడం కష్టం అని భావించి పుస్తకం పట్టింది. చివరికి డిగ్రీ పూర్తి చేసి ఏ బ్యాంకులో స్వీపర్‌గా గదులు శుభ్రం చేసిందో అదే బ్యాంకులో ఉన్నత స్థానంలో నిలిచింది.
ప్రతీక్షా టోండ్‌వల్కర్… 57 ఏళ్ల వయసులో ఎస్‌బీఐ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. 17 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకి భర్త చనిపోయిన తర్వాత కొడుకును పోషించుకోలేక పుస్తకం పట్టింది. ఓ వైపు స్వీపర్‌గా పనిచేస్తూనే చదువుకునేది. అలా పదో తరగతి పూర్తి చేసి, ముంబయి ఎస్‌ఎన్‌డీటీ కాలేజ్‌లో డిగ్రీ చదివింది. తర్వాత బాంద్రాలోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేశారు. అదే బ్యాంకులో మెసెంజర్‌గా పనిచేసే ప్రమోద్ టోండ్‌వల్కర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన ప్రోత్సాహంతో బ్యాంక్ ఇంటర్నల్ పరీక్ష రాసి ట్రైనీ ఆఫీసర్‌గా ప్రమోషన్ పొందారు. తాజాగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు.