తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ తగిలింది. ముఖ్యనేత దాసోజు శ్రవణ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ను భ్రష్ణుపట్టిస్తున్నారని.. ఆయన నాయకత్వంలో పనిచేయలేమని తేల్చిచెప్పారు. రేవంత్ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నట్లు కనిపించడం లేదన్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో మాఫియా తరహా రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. కాంగ్రెస్ కోసం పాటుపడిన తమనే బలహీనపరుస్తున్నారని.. పార్టీలోకి వచ్చింది బానిసగా బతికేందుకు కాదన్నారు. ఫ్యూడల్ భావజాలంతో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇటీవలే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాసోజు శ్రవణ్ కూడా పార్టీని వీడటం చర్చనీయాంశంగా మారింది.