ఎన్టీఆర్ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి బలవన్మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీబీఐ విచారణ కోరాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్రానికి చంద్రబాబు లేఖ రాసి తన నిజాయతీని నిరూపించుకోవాలని సూచించారు.
ఆస్తి తగాదాలతో మానసిక వేదనకు గురిచేయడంతోనే ఉమామహేశ్వరి చనిపోయినట్లు తెలుస్తోందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో లక్ష్మీపార్వతి మాట్లాడారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్‌ను అదే మానసిన వేదనకు గురిచేసి కుంగుబాటుతో చనిపోయేలా చేశారని పునరుద్ఘాటించారు. ఉమామహేశ్వరి సూసైడ్‌లేఖ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు వచ్చిన తర్వాత దాన్ని మాయం చేసినట్లు తాను నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు.
ఉమామహేశ్వరి మృతిపై సీబీఐ విచారణ కోరుతూ చంద్రబాబు లేఖ రాయకపోతే తాను రాస్తానని చెప్పారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. నందమూరి కుటుంబం నుంచి ఎవరూ రాకూడదా? నారా కుటుంబమే ఉండాలా? అని నిలదీశారు.