సహజంగా మహిళలకు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయని మనకు తెల్సిందే. ఈ క్రమంలో అండం పిండంగా మారే దశ నుంచి బిడ్డ పుట్టేంతవరకూ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాంతులు, వికారం, మలబద్ధకం, గుండెల్లో మంట, నడుం నొప్పితోపాటు కాలేయ సంబంధ రుగ్మతలు కూడా ఇబ్బంది పెడతాయి. వీటిని అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
› గర్భిణులను ఎక్కువగా వేధించే సమస్య అజీర్ణం. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినాలి. తొందరపాటు లేకుండా, నిదానంగా నమిలి మింగాలి.
› రాత్రి పడుకునే సమయానికి రెండు గంటల ముందే భోజనం అయిపోవాలి. అలసట తీరేందుకు వీలైనంత ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి.
› గర్భంలో బిడ్డకు మరింత చోటు సమకూర్చడానికి శరీరం కండరాల్ని సడలించడం వల్ల వెన్ను నొప్పులు వస్తుంటాయి. గర్భస్థ శిశువు పెరిగే కొద్దీ మూత్రాశయం మీద ఒత్తిడి అధికం
అవుతుంది. కాబట్టి, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాలి.
› మడమలు, కాళ్లకు శక్తినిచ్చే వ్యాయామాల వల్ల రక్త సరఫరా మెరుగుపడి తిమ్మిర్లు తగ్గుతాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని నివారించవచ్చు.
› వీలైనంత ఎక్కువ నీళ్లు తాగడం వల్ల తలనొప్పి, గుండెలో మంట తదితర సమస్యలు తగ్గుతాయి. నూనెలు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు. పాలు, పండ్లు, కూరగాయలతో కూడిన పోషకాహారాన్నే ఎంచుకోవాలి. ముఖ్యంగా వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులూ వేసుకోకూడదు.